Rangareddy district

ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు.. ఇబ్రహీంపట్నం నుంచే శ్రీకారం!

జీవో వచ్చిన 24 గంటల్లో స్థలాలు చూపిస్తాం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

By ·

Share this article
ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు.. ఇబ్రహీంపట్నం నుంచే శ్రీకారం!

ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు.. ఇబ్రహీంపట్నం నుంచే శ్రీకారం!

జీవో వచ్చిన 24 గంటల్లో స్థలాలు చూపిస్తాం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

తొర్రూర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం

తొర్రూర్: తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు జీవో జారీ అయిన 24 గంటల్లోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రక్రియకు శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. అర్హులైన ఉద్యమకారులకు వారు కోరుకున్న ప్రాంతంలో ఇంటి స్థలం చూపించే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. మంగళవారం తొర్రూర్‌లో రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్క నాయకుడి పోరాటంతోనే రాష్ట్రం ఏర్పడలేదని, అనేక మంది ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి తగిన గుర్తింపు, సంక్షేమం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై హైలెవెల్‌ కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉందని తెలిపారు. జీవో వచ్చిన వెంటనే అర్హులైన ఉద్యమకారులకు స్థలాల కేటాయింపునకు చర్యలు చేపడతామని చెప్పారు. జీవో వచ్చిన 24 గంటల్లోనే నియోజకవర్గంలోని ఉద్యమకారులకు స్థలాలు చూపించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా పేదలు, ఉద్యమకారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

రానున్న కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని మల్‌రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. తాను 80 వేల మెజార్టీతో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. ప్రస్తుత దశలో ఉద్యమకారులకు ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తామని, తిరిగి అవకాశం లభిస్తే ఉద్యమకారులకు గృహ నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధులు, ఉద్యమకారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: