Rangareddy district

హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకుండా చర్యలు

రిజర్వాయర్ల నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ ఎస్టీపీలు వంద శాతం సామర్థ్యంతో పనిచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

By ·

Share this article
హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకుండా చర్యలు

హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకుండా చర్యలు

రిజర్వాయర్ల నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ

ఎస్టీపీలు వంద శాతం సామర్థ్యంతో పనిచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర తాగునీటి సరఫరాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

క్యూర్‌ పరిధిలో మంచినీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణం, శుద్ధి చేసిన నీటి వినియోగంపై బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్యూర్‌ పరిధిలోని ఎస్టీపీలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శుద్ధి చేసిన నీటి వినియోగం పెంచాలి

సచివాలయం, సీఎంవో, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, మెట్రో రైలు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పచ్చదనం నిర్వహణతో పాటు ఇతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సీఎం సూచించారు. ప్రజా పార్కులు, రోడ్ల శుభ్రతకు కూడా ట్రీటెడ్‌ వాటర్‌నే ఉపయోగించాలని స్పష్టం చేశారు.

భవన నిర్మాణాల్లో శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్‌ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకు సైతం శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

నాణ్యత విషయంలో రాజీ వద్దు

ఎస్టీపీల్లో నీటి శుద్ధికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుద్ధి చేసిన నీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. ప్రతి నీటి శుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించి, అన్ని ప్లాంట్లను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఎస్టీపీల నిర్వహణకు సౌర విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రెడ్కో ఉన్నతాధికారులకు సూచించారు. ఎస్టీపీల పనితీరును హైడ్రా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ట్రీటెడ్‌ వాటర్‌ ట్యాంకర్లకు ట్రాకింగ్‌

శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్‌ చేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ట్రీటెడ్‌ వాటర్‌ వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వినియోగదారుల సౌకర్యార్థం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఎస్టీపీల నిర్వహణ, శుద్ధి చేసిన నీటి వినియోగానికి సంబంధించిన ఆదేశాలను నవంబర్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

26 ఎస్టీపీల నుంచి సరఫరా

ప్రస్తుతం 26 ఎస్టీపీల నుంచి గ్రీన్‌ ట్యాంకర్ల ద్వారా ట్రీటెడ్‌ వాటర్‌ను సరఫరా చేస్తున్నట్లు జలమండలి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వినియోగదారుల నుంచి నీటికి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని, కేవలం రవాణా చార్జీలను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు.

సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: