Rangareddy district

బాలుడి మృతి ఘటనపై తారా ఆసుపత్రిలో తనిఖీలు

కుటుంబ సభ్యుల ఆరోపణలపై వైద్య ఆరోగ్యశాఖ విచారణ

By ·

Share this article
బాలుడి మృతి ఘటనపై తారా ఆసుపత్రిలో తనిఖీలు

బాలుడి మృతి ఘటనపై తారా ఆసుపత్రిలో తనిఖీలు

కుటుంబ సభ్యుల ఆరోపణలపై వైద్య ఆరోగ్యశాఖ విచారణ

ఆదిభట్ల: బ్రాహ్మణపల్లి చౌరస్తాలోని తారా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బాలుడికి ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.

డీఎంహెచ్‌ఓ కళ్యాణ్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో అధికారులు ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలను పరిశీలించారు. బాలుడికి అందించిన చికిత్స, వైద్య రికార్డులు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఆసుపత్రి అనుమతులకు సంబంధించిన వివరాలను యాజమాన్యం నుంచి సేకరించారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ కళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ.. బాలుడి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆసుపత్రికి ప్రస్తుతం తాత్కాలిక అనుమతులు మాత్రమే ఉన్నాయని, నిబంధనల ప్రకారం ఆసుపత్రి బోర్డుపై పేర్లు నమోదైన వైద్యులే చికిత్స అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఆసుపత్రి యాజమాన్యం నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, రెండు రోజుల్లో విచారణకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు లేదా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆసుపత్రిని సీజ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తనిఖీల్లో డీఈఎంఓ మంజుల, మండల వైద్యాధికారి ప్రియాంక, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: