Rangareddy district

రాజ్యాంగ నిర్మాతకు ఇదేనా గౌరవం..?

అంబేద్కర్‌ను మరిచారా..? జయంతి, వర్ధంతికే గుర్తొస్తారా? కొంగరకలాన్‌లో నిర్లక్ష్యానికి గురైన రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రాంగణం

By ·

Share this article
రాజ్యాంగ నిర్మాతకు ఇదేనా గౌరవం..?

రాజ్యాంగ నిర్మాతకు ఇదేనా గౌరవం..?

అంబేద్కర్‌ను మరిచారా..? జయంతి, వర్ధంతికే గుర్తొస్తారా?

కొంగరకలాన్‌లో నిర్లక్ష్యానికి గురైన రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రాంగణం

కొంగరకలాన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను జయంతి, వర్ధంతి వేడుకలకే పరిమితం చేస్తున్నారా..? ఆయన విగ్రహం ఉన్న ప్రాంగణం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొంగరకలాన్ కలెక్టరేట్‌కు సమీపంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం చుట్టూ పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి అపరిశుభ్రంగా మారిన పరిస్థితిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టరేట్‌కు వివిధ కార్యక్రమాలు, ర్యాలీలు, కాలినడకన వచ్చే ప్రజలకు ఈ ప్రాంతం ప్రధాన మార్గంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అలాంటి ప్రదేశంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ పరిశుభ్రత లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని అంటున్నారు. జయంతి, వర్ధంతి సందర్భాల్లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా, ఏడాది పొడవునా విగ్రహ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, గౌరవప్రదంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

విగ్రహం చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించడంతో పాటు ప్రాంగణాన్ని శుభ్రపరిచి, క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని వారు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

విగ్రహాలకు నివాళులు మాత్రమే కాదు.. వాటి పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ కూడా బాధ్యతేనని స్థానికులు గుర్తుచేస్తున్నారు.

Tags: