ముందస్తు అరెస్టులు కాదు.. హామీలు అమలు చేయాలి
ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కాలయాపన తగదు
బాచుపల్లి నివాసంలో హౌస్ అరెస్టును ఖండించిన కప్పాటి పాండురంగా రెడ్డి
అర్హులైన ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ఆన్లైన్లో చేపట్టాలని డిమాండ్
కందుకూరు, అక్టోబరు 26:(మన దిశ )తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సమంజసం కాదని తెలంగాణ ఉద్యమకారుడు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. ఉద్యమకారుల సంఘాల పిలుపు మేరకు చేపట్టిన ‘ముఖ్యమంత్రి నివాసం ముట్టడి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సోమవారం బాచుపల్లిలోని తన నివాసంలో కందుకూరు పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన ఉద్యమకారులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలతో అడ్డుకోవడం సరికాదన్నారు. ఉద్యమకారులను నిర్బంధించడంలో చూపుతున్న శ్రద్ధను, వారికి ఇచ్చిన హామీల అమలుపై చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం సమస్యలను పరిష్కరించి, ఉద్యమకారులకు న్యాయం చేయడం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కప్పాటి పాండురంగా రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా ఉద్యమకారులకు తగిన గౌరవం, గుర్తింపు లభించలేదని అన్నారు. గత పాలనలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అనేక మంది నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన ఉద్యమకారులకు ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ‘తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ’ ద్వారా అర్హులైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలో తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కమిటీ నివేదిక ఆధారంగా అర్హులైన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ఆత్మగౌరవాన్ని కాపాడాలని కప్పాటి పాండురంగా రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
కప్పాటి పాండురంగా రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుడు,
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్






