మాల్ గోల్మాల్..!
మాల్ గ్రామపంచాయతీ నిధులపై ఆరోపణలు
పాఠశాల రంగుల పనుల చెక్కు పక్కదారి పట్టిందా?
సర్పంచ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఫిర్యాదు
మాల్ పంచాయతీలో ‘చెక్కు’ చిచ్చు..!
మాల్ గ్రామం, ఇబ్రహీంపట్నం: మాల్ గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై ఆరోపణలు వెలుగుచూశాయి. మాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి రంగులు వేసిన కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన చెక్కును చెల్లించకుండా, సర్పంచ్ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నారని మాజీ ఉపసర్పంచ్ మాధవి భర్త గెనమాని గోపాల్ (S/o రాములు) ఆరోపించారు.
గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన మాల్ గ్రామపంచాయతీ నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. పంచాయతీకి సంబంధించిన MB రికార్డులు, పంచాయతీ నుంచి డ్రా చేసిన నిధుల వివరాలు, చెక్కుల వివరాలు, చెల్లింపుల రికార్డులను పరిశీలించాలని అధికారులను కోరారు.
ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గోపాల్ తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి (DPO)లకు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
నిధులపై సమగ్ర విచారణకు డిమాండ్
మాల్ గ్రామపంచాయతీ ఖాతాల నుంచి జరిగిన చెల్లింపులు, చెక్కుల వినియోగం, పాఠశాల రంగుల పనులకు సంబంధించిన MB రికార్డులను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని గోపాల్ కోరారు. ఆరోపణలు విచారణలో నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





