దసరా వేళ.. పంచాయతీ కార్మికులకు కొత్త దుస్తులు
సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ బాడీ సమావేశం.. అనంతరం దుస్తుల పంపిణీ
యాచారం: దసరా పండుగను పురస్కరించుకుని యాచారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు కొత్త బట్టలను పంపిణీ చేశారు. ముందుగా సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ బాడీ సమావేశం నిర్వహించి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు దసరా పండుగ కానుకగా కొత్త దుస్తులను అందజేశారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. పండుగ సందర్భంలో కార్మికులతో కలిసి సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధితో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికులు అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఉపసర్పంచ్ మంగకృష్ణ, వార్డు సభ్యులు జోగు అంజయ్య, మస్కు యాదయ్య, షేక్ పాషా, ఎం. ప్రదీప్, శ్రీనాథ్, బెల్లి వైష్ణవి రమేష్, నరిమళ్ల లావణ్య వెంకటేష్, శ్రీకాంత్ తదితరులతో పాటు పంచాయతీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా తమకు కొత్త దుస్తులు అందజేయడం పట్ల పంచాయతీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.





