Telangana

వాట్సాప్‌లో ‘NO’ అంటే.. ఖాతా ఖాళీ!

లింక్, ఓటీపీ లేకుండానే మోసం.. ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

By ·

Share this article
వాట్సాప్‌లో ‘NO’ అంటే.. ఖాతా ఖాళీ!

వాట్సాప్‌లో ‘NO’ అంటే.. ఖాతా ఖాళీ!

లింక్, ఓటీపీ లేకుండానే మోసం.. ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్, : సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ‘మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయింది.. మీరు ఆ లావాదేవీ చేయకపోతే ‘NO’ అని రిప్లై ఇవ్వండి’ అంటూ గుర్తుతెలియని నంబర్ల నుంచి వాట్సాప్‌ సందేశాలు పంపుతున్నారు. పొరపాటున ఆ సందేశానికి స్పందిస్తే ఫోన్‌లో దాగి ఉన్న మాల్‌వేర్‌ యాక్టివేట్‌ అయ్యే ప్రమాదం ఉందని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు.

స్పందిస్తే ప్రమాదమే..

సైబర్‌ నేరగాళ్లు పంపించే ఇలాంటి సందేశాల్లో ఎలాంటి లింక్‌ కనిపించకపోవడంతో చాలామంది వాటిని నమ్మే అవకాశం ఉంది. అయితే సందేశానికి ‘YES’ లేదా ‘NO’ అని స్పందించడం ద్వారా హానికరమైన ఫైల్‌ లేదా మాల్‌వేర్‌ పనిచేయడం ప్రారంభించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా మొబైల్‌లోని కీలక సమాచారం నేరగాళ్లకు చేరడంతో పాటు బ్యాంకింగ్‌ వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

ఓటీపీ అవసరం లేకుండానే..

సాధారణంగా సైబర్‌ మోసాల్లో ఓటీపీ లేదా లింక్‌ను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం కొత్త తరహా ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌’తో బాధితుడి ప్రమేయం లేకుండానే మాల్‌వేర్‌ను యాక్టివేట్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అందువల్ల గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే బ్యాంకింగ్‌ సంబంధిత సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బ్యాంక్‌ యాప్‌లోనే పరిశీలించాలి

ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయిందంటూ వాట్సాప్‌లో సందేశం వస్తే వెంటనే స్పందించకుండా.. సంబంధిత బ్యాంకు అధికారిక యాప్‌లోకి వెళ్లి ఖాతా స్టేట్‌మెంట్‌ను పరిశీలించాలి. లావాదేవీ జరగకపోతే ఆ సందేశాన్ని పట్టించుకోకుండా నంబర్‌ను బ్లాక్‌ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘YES’, ‘NO’ అంటూ స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మోసపోతే 1930కు ఫోన్‌

సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి. వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా నగదు లావాదేవీలను నిలిపివేసే అవకాశం ఉంటుందని పోలీసులు సూచించారు.

Tags: