పేరున్న హోటళ్లలో బొద్దింకలు.. ఎలుకల సంచారం!
హైదరాబాద్‌లో 14 హోటళ్ల లైసెన్సులు సస్పెండ్.. 544 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం
హైదరాబాద్( మన దిశ ): నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై టీజీ సేఫ్ అధికారులు కొరడా ఝళిపించారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో 22 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 22 హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు హోటళ్ల వంటగదుల్లో అపరిశుభ్ర వాతావరణం, బూజుపట్టిన ఆహారం, బొద్దింకలు, ఎలుకల సంచారం, పదేపదే వినియోగించిన వంట నూనె వంటి అంశాలు అధికారుల దృష్టికి వచ్చాయి.
తనిఖీల సందర్భంగా సుమారు 544 కిలోల కుళ్లిన, కలుషిత ఆహారాన్ని గుర్తించి పారవేశారు. ఆహార నాణ్యతపై అనుమానాలున్న 21 నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని 8 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ముఖ్యంగా మలక్‌పేటలోని సోహైల్ రెస్టారెంట్ వంటగదిలో గుట్కా ప్యాకెట్లు, ఉమ్మిన ఆనవాళ్లు కనిపించడంతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగించినట్లు టీజీ సేఫ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆహార తయారీ ప్రాంతాల్లో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు.
లైసెన్సులు సస్పెండ్ అయిన హోటళ్లు
1. హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ – టోలిచౌకి, సంతోష్‌నగర్
2. లక్కీ రెస్టారెంట్ – సంతోష్‌నగర్
3. షా ఘౌస్ కేఫ్ – షాలిబండ
4. హోటల్ నయాబ్ – చార్మినార్
5. శ్రీ బాలాజీ ఫ్యామిలీ ధాబా – గుడిమల్కాపూర్
6. సిద్ధిక్ కబాబ్ సెంట్రల్ కిచెన్ – గుడిమల్కాపూర్
7. అల్సబా హోటల్ – టోలిచౌకి
8. మెహఫిల్ రెస్టారెంట్ – దిల్సుఖ్నగర్
9. డైన్ హిల్ రెస్టారెంట్ – మాసబ్‌ట్యాంక్
10. సోహైల్ రెస్టారెంట్ – మలక్‌పేట
11. హోటల్ అక్షయ టిఫిన్స్ – మలక్‌పేట
12. హోటల్ వెంకటేశ్వర – ఎంజేఆర్ రోడ్
13. అజీబో ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్ – రెతిబౌలి
ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించే హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు మరింత విస్తృతం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.






