Telangana

జర్నలిస్టుల నిర్బంధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంఘం

పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ పిటిషన్.. జర్నలిస్టుల రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

By ·

Share this article
జర్నలిస్టుల నిర్బంధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంఘం

జర్నలిస్టుల నిర్బంధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంఘం

పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ పిటిషన్.. జర్నలిస్టుల రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ : ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించడం, బలవంతంగా అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి తరలించడం వంటి చర్యలను సవాల్ చేస్తూ నెట్‌వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఇండియా (NWMI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేసింది.

జర్నలిస్టులపై పోలీసుల చర్యలు ఆర్టికల్ 14, 19(1)(a), 19(1)(d), 21 కింద కల్పించిన హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. నిరసన కార్యక్రమాల సమయంలో స్వతంత్రంగా వార్తా సేకరణ చేసే మీడియా ప్రతినిధులకు తగిన రక్షణ కల్పించాలని కోరింది.

PIB గుర్తింపు కార్డు చూపించినా నిర్బంధం

సీనియర్ జర్నలిస్టు పరంజోయ్ గుహా ఠాకుర్తా అక్టోబర్ 10న తన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గుర్తింపు కార్డును చూపించినప్పటికీ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. నిర్బంధానికి కారణాలను తనకు తెలియజేయలేదని, సంబంధిత పత్రాలను కూడా అందించలేదని ఆయన పేర్కొన్నట్లు వివరించారు.

రెండు రోజుల్లో 35 మంది జర్నలిస్టుల నిర్బంధం?

ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో కనీసం 35 మంది జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (CPJ) నివేదికను కూడా NWMI తన పిటిషన్‌లో ప్రస్తావించింది.

నిరసనల సమయంలో వార్తా సేకరణ చేసే జర్నలిస్టుల విధులకు ఆటంకం కలగకుండా, వారి వాక్ స్వాతంత్ర్యం, సమాచార సేకరణ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని మీడియా సంఘం కోరింది.

Tags: