ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణకు సంక్షోభ హెచ్చరిక!
20 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్.. 200 టీఎంసీల నీటిని పొదుపుగా వాడాలి
“పార్టీలు కాదు.. ప్రజల ప్రయోజనమే ముఖ్యం.. అందరం కలిసి ఎదుర్కొందాం” – సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, తాగునీటి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితిని సాధారణ సమస్యగా చూడకుండా ముందస్తు చర్యలతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విద్యుత్, తాగునీరు, సాగునీరు, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
గత మూడేళ్లుగా అక్టోబర్‌లో రోజుకు సుమారు 15 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ వినియోగం ప్రస్తుతం 20 వేల మెగావాట్లకు చేరిందని సీఎం తెలిపారు. పంటలు చేతికొచ్చే సమయంలో నీరు అందించాల్సి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల పంపుసెట్లు ఒకేసారి పనిచేస్తున్నాయని చెప్పారు. అక్టోబర్‌లోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు.
“కోవిడ్‌లా అందరూ కలిసి ఎదుర్కోవాలి”
కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి పిలుపునకు స్పందించి ప్రజలు, రాజకీయ పార్టీలు కలిసి పనిచేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితిని కూడా అందరూ కలిసి ఎదుర్కోవాలని కోరారు.
“మీరు ప్రతిపక్షమా.. కేంద్రంలో ఉన్న పార్టీయా.. ఇప్పుడే పుట్టిన పార్టీయా.. డిపాజిట్లు రాని పార్టీయా.. భవిష్యత్తులో కూడా రాకుండా ఓడిపోతారా అనే పార్టీయా.. ఇవన్నీ మేము చూడదలుచుకోలేదు” అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రకృతి విపత్తును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలు కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
నీటికి ఇక ప్రాధాన్యం
“బియ్యం, ఉప్పు, పప్పు, బెల్లం, నూనె ఏదైనా కొనుక్కోవచ్చు.. కానీ నీళ్లు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది” అని సీఎం హెచ్చరించారు. ఎంత డబ్బు చెల్లించినా నీరు లభించని పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అందుబాటులో ఉన్న సుమారు 200 టీఎంసీల నీటిని రాబోయే 8 నుంచి 10 నెలలు పొదుపుగా వినియోగించాలని, తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
మీడియా సహకారం అవసరం
ప్రస్తుత పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
“ఈ ప్రకృతి విపత్తును జయించడానికి మీ అందరి సహకారం ఈ ప్రభుత్వానికి కావాలి. ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారం నూటికి నూరు శాతం అవసరం” అని అన్నారు.
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్, తాగునీరు, సాగునీరు, వ్యవసాయంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.






