కుక్కల దాడిలో గొర్రెలు మృతి.. రైతుకు భారీ నష్టం
10 గొర్రెలు మృతి.. మరో 10 గొర్రెలకు గాయాలు
రూ.2 లక్షల వరకు నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
యాచారం, అక్టోబర్ 31: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో కుక్కల దాడితో రైతు అచ్చన బీరప్పకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయనకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో సుమారు 10 గొర్రెలు మృతి చెందగా, మరో 10 గొర్రెల వరకు గాయపడినట్లు గ్రామ ఉపసర్పంచ్ గౌర నాగరాజ్ తెలిపారు.
గొర్రెల పెంపకమే జీవనాధారంగా చేసుకున్న బీరప్పకు ఈ ఘటనతో సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిపారు. గాయపడిన గొర్రెలకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మృతి చెందిన గొర్రెల కారణంగా రైతు కుటుంబంపై అదనపు ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు.
గ్రామ పరిసరాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న కుక్కల వల్ల పశువులు, గొర్రెలకు ముప్పు ఏర్పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనను పరిశీలించి, మృతి చెందిన, గాయపడిన గొర్రెల వివరాలను నమోదు చేసి నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నారు.
కుక్కల దాడిలో నష్టపోయిన అచ్చన బీరప్పను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఉపసర్పంచ్ గౌర నాగరాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన నష్టపరిహారం అందించాలని, గ్రామాల్లో పశువులపై కుక్కల దాడులు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.






