Ibrahimpatnam

మంగళపల్లిలో సర్కార్‌ భూమికి రక్షణ కరువు

రికార్డుల నుంచి తొలగించారు.. భూమిని కాపాడేదెవరు?

By ·

Share this article
మంగళపల్లిలో సర్కార్‌ భూమికి రక్షణ కరువు

మంగళపల్లిలో సర్కార్‌ భూమికి రక్షణ కరువు

రికార్డుల నుంచి తొలగించారు.. భూమిని కాపాడేదెవరు?

ప్రభుత్వ భూమికి రక్షణ ఏది..?

మంగళపల్లి సర్వే నంబర్‌ 96లో 4.25 ఎకరాల భూమిపై అధికారుల నిర్లక్ష్యం

ఇబ్రహీంపట్నం, నవంబర్ 1 (మన దిశ) :ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 96లో ఉన్న 4.25 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ భూమి అక్రమంగా పట్టా భూమిగా మారిందనే ఆరోపణలు గతంలో వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సదరు సర్వే నంబర్‌ను భూ భారతి రికార్డుల నుంచి తొలగించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భూమిని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడంపై మాత్రం స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు అధికారులు గతంలో ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ ఏర్పాటు చేసిన సూచిక బోర్డు ప్రస్తుతం కనిపించకుండా పోవడం కూడా స్థానికుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వ భూమికి సంబంధించిన బోర్డు తొలగిపోవడంపై అధికారులు విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమికి రక్షణ చర్యలు లేకపోతే భవిష్యత్‌లో ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ణయించడంతో పాటు, చుట్టూ కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అదృశ్యమైన సూచిక బోర్డును తిరిగి ఏర్పాటు చేసి, భూమిపై ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags: