రాగన్నగూడలో వివాహిత అనుమానాస్పద మృతి
భర్తపై మృతురాలి తండ్రి అనుమానం.. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు
ఆదిబట్ల, అక్టోబర్ 31: ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాగన్నగూడలో ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ముదిరెడ్డి లక్ష్మారెడ్డి తన మూడో కుమార్తె స్నేహకు సుమారు ఆరున్నరేళ్ల క్రితం రాగన్నగూడకు చెందిన శ్యామ్ సుందర్‌రెడ్డితో వివాహం జరిపించారు. ఈ దంపతులకు ధ్రువ్, ధృతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయని మృతురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన అల్లుడు మద్యానికి బానిసై మరో మహిళతో సంబంధం కొనసాగిస్తూ కుమార్తెను వేధించేవాడని లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఈ విషయాలను స్నేహ పలుమార్లు ఫోన్ ద్వారా తనకు చెప్పిందని, దీంతో అల్లుడిని పలుమార్లు మందలించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, అక్టోబర్ 30న ఉదయం సుమారు 8:20 గంటల సమయంలో శ్యామ్ సుందర్‌రెడ్డి మృతురాలి సోదరి శ్వేతకు ఫోన్ చేసి స్నేహ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందని, ఉరివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న శ్వేత అక్కడికి వెళ్లి చూడగా అపార్ట్మెంట్ పార్కింగ్ ప్రాంతంలో కారులో స్నేహ మృతదేహం ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు.
కుమార్తె మృతిపై భర్త శ్యామ్ సుందర్‌రెడ్డిపై అనుమానం ఉందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంఘటనకు ముందు జరిగిన పరిణామాలు, కుటుంబ కలహాలు, మృతికి దారితీసిన పరిస్థితులు తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వాస్తవాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






