పోచారం అభివృద్ధి పనులకు జాతీయ బృందం కితాబు!
ఐదు రాష్ట్రాల ప్రతినిధులతో NIRD బృందం క్షేత్రస్థాయి పరిశీలన
ఇబ్రహీంపట్నం: గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు NIRD (National Institute of Rural Development)కు చెందిన ప్రతినిధుల బృందం ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామాన్ని సందర్శించింది. ఒడిశా, గుజరాత్, జమ్మూ–కాశ్మీర్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు.
గ్రామంలోని నర్సరీ, గ్రామపంచాయతీ కార్యాలయం, స్వయం సహాయక సంఘాలు, పల్లె ప్రకృతి వనం, వ్యర్థాల విభజన కేంద్రం, ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా పథకాల అమలు, నిర్వహణ, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక ప్రజాప్రతినిధులు బృందానికి వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.






