మూడు నెలలుగా పనులు పెండింగ్.. ప్రజలకు తప్పని ఇబ్బందులు!
మాల్ మార్కెట్ 7వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులపై స్థానికుల ఆవేదన
మాల్ (మన దిశ ): మాల్ గ్రామపంచాయతీ పరిధిలోని మాల్ మార్కెట్ 7వ వార్డులో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో గత మూడు నెలలుగా సమస్యలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురిసిన సమయంలో రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు వెళ్లేందుకు మార్గం లేక ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు చెబుతున్నారు. పనులు మధ్యలో నిలిచిపోవడంతో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే పనులు ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పనుల పురోగతిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మాల్ గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకుని, సంబంధిత కాంట్రాక్టర్‌తో పనులను వేగవంతం చేయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని 7వ వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






