కొంగరకలాన్ డంపింగ్ యార్డును తరలించాలి
దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందులు.. కలుషితమవుతున్న నీటి వనరులు
ఆదిభట్ల డీసీకి బీజేపీ నేతల వినతి.. సమస్య పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
కొంగరకలాన్: (మాన దిశ )రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయం వెనుక కొంగరకలాన్ గ్రామ పరిధిలో కొనసాగుతున్న చెత్త డంపింగ్ యార్డును తక్షణమే అక్కడి నుంచి తరలించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్త అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు కారణంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డికి బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గజ్జల నర్సింహా రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
కొంగరకలాన్‌లోని సర్వే నంబర్ 300లో చెత్తను తరలించి నిల్వ చేయడం వల్ల పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తోందని నాయకులు పేర్కొన్నారు. దీంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డు నిర్వహణ, చెత్త నిల్వ విధానంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
నీటి వనరుపై ఆందోళన
డంపింగ్ యార్డుకు సమీపంలో ఉన్న బోడబండ మంచినీటి క్వారీని గతంలో గ్రామస్తులు తాగునీరు, ఇతర అవసరాలకు వినియోగించేవారని నాయకులు తెలిపారు. ప్రస్తుతం చెత్త వ్యర్థాలు చేరడంతో నీటి వనరు కలుషితమై వినియోగానికి అనుకూలంగా లేకుండా పోయిందని ఆరోపించారు. నీటి నాణ్యతపై సంబంధిత శాఖలతో పరీక్షలు నిర్వహించి, వాస్తవ పరిస్థితిని ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్, పరిశ్రమల సమీపంలోనే చెత్త నిల్వ
జిల్లా పరిపాలనకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయానికి సమీపంలోనే పెద్ద ఎత్తున చెత్తను నిల్వ చేయడం వల్ల పరిసర ప్రాంతాలపై ప్రభావం పడుతోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అదే ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు, ఉద్యోగులు, సందర్శకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు.
ఆలయాల సమీపంలో డంపింగ్‌పై అభ్యంతరం
డంపింగ్ యార్డుకు సమీపంలో పెద్దమ్మతల్లి, బీరప్ప దేవాలయాలు ఉన్నాయని, వాటి పరిసరాల్లో భారీగా చెత్తను నిల్వ చేయడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణానికి ఇబ్బంది కలుగుతోందని నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను ఒకే చోటుకు తరలించకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
డంపింగ్ యార్డు వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న అంశాన్ని అధికారులు పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కొత్త అశోక్ గౌడ్ కోరారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు పొట్టిరాములు, పండల లక్ష్మిపతి గౌడ్, ఉడుతల అశోక్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీదేవి, జిల్లా కార్యవర్గ సభ్యులు శివ వీరస్వామి గౌడ్, ఆదిభట్ల డివిజన్ అధ్యక్షులు కూర శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రామగల నరసింహ, మాజీ ఉపసర్పంచ్ సభావత్ రమేష్, కోలా శ్రీనివాస్, సభావత్ కృష్ణ, బూత్ కమిటీ అధ్యక్షుడు నోముల రాజు, బీజేవైఎం నాయకులు గోదసు శ్రీకాంత్, ఉడుగుల భరత్ గౌడ్, గోదాస్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






