Ibrahimpatnam

కాలువలు కబ్జా.. అధికారుల మౌనం!

శ్రీమాతా వెంచర్‌లో యథేచ్ఛగా మట్టి పోసి ప్లాట్ల విక్రయాలు

By ·

Share this article
కాలువలు కబ్జా.. అధికారుల మౌనం!

కాలువలు కబ్జా.. అధికారుల మౌనం!

శ్రీమాతా వెంచర్‌లో యథేచ్ఛగా మట్టి పోసి ప్లాట్ల విక్రయాలు

పట్టించుకోని సంబంధిత అధికారులు

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖల్సా గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 246/పార్ట్, 247/పార్ట్‌లలో కాలువల ధ్వంసం, పూడ్చివేత వ్యవహారం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. శ్రీమాతా వెంచర్‌ పరిధిలో కాలువలపై మట్టి పోసి, వాటి సహజ ప్రవాహ మార్గాలను దెబ్బతీసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాల కోసం ఉండాల్సిన కాలువలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార ప్రయోజనాలకు బలవుతున్నాయనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాలువల మార్గాలను ఇష్టానుసారంగా మార్చి, వాటిపై మట్టి పోసి స్థలాలుగా చూపిస్తూ అమాయక కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జీవితకాల సంపాదనతో ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన నెలకొంది.

ఇంత జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్‌ అధికారులు ఏం చేస్తున్నట్లు? కాలువల పరిరక్షణ బాధ్యత అధికారులదే కాదా? క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూములు, నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజలకు నష్టం తప్ప మరేమి మిగులుతుందని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్‌, రెవెన్యూ, లేఅవుట్‌ అనుమతులకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి. కాలువల అసలు హద్దులను గుర్తించి, నిబంధనలకు విరుద్ధంగా పూడ్చివేతలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్లాట్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాలి.

ప్రజల ఆవేదన అధికారుల చెవులకు చేరుతుందా? లేక అక్రమాలపై మౌనం ఇలాగే కొనసాగుతుందా? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags: