Ibrahimpatnam

ఆదిభట్లలో అక్రమ కట్టడాల జోరు!

పర్మిషన్‌ ఒకలా.. నిర్మాణాలు మరోలా? | పేరుకే జీ+2.. మూడో అంతస్తు నిర్మాణాలపై ఆరోపణలు | అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు

By ·

Share this article
ఆదిభట్లలో అక్రమ కట్టడాల జోరు!

ఆదిభట్లలో అక్రమ కట్టడాల జోరు!

పర్మిషన్‌ ఒకలా.. నిర్మాణాలు మరోలా? | పేరుకే జీ+2.. మూడో అంతస్తు నిర్మాణాలపై ఆరోపణలు | అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు

ఆదిభట్ల: ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణాలకు ఒక విధమైన అనుమతులు తీసుకుని, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పత్రాల్లో జీ+2గా అనుమతులు ఉండగా.. వాస్తవంగా మూడో అంతస్తు నిర్మాణాలు కూడా చేపడుతున్నారనే ఆరోపణలు అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పర్మిషన్‌ ఒకలా.. నిర్మాణం మరోలా?

నిర్మాణ అనుమతులు పొందే సమయంలో సమర్పించిన ప్లాన్‌కు అనుగుణంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయా? లేదా అనుమతులను ఉల్లంఘించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారా? అనే అంశంపై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్లయితే సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జీ+2 అనుమతి.. మూడో ఫ్లోర్ ఎలా?

కొన్ని నిర్మాణాలకు జీ+2 వరకు అనుమతి ఉన్నప్పటికీ, అదనంగా మరో అంతస్తు నిర్మాణం జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తే భవన భద్రతతో పాటు రోడ్లు, పార్కింగ్, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వారు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిబంధనల ఉల్లంఘనలను గుర్తించాల్సి ఉండగా.. నిర్మాణాలు పూర్తయ్యే దశకు వచ్చిన తర్వాత కూడా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమా? లేక అక్రమ నిర్మాణాలకు అండదండలు ఉన్నాయా? అన్న చర్చ జరుగుతోంది.

కమిషనర్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఆదిభట్ల పరిధిలో అనుమతులు, నిర్మాణాలపై సమగ్ర పరిశీలన చేపట్టి.. అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, టీపీఓ (టౌన్‌ ప్లానింగ్‌ అధికారి) ప్రత్యేకంగా దృష్టి సారించి ఆదిభట్లలో జరుగుతున్న నిర్మాణాలపై క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Tags: